బాలకాండము-02
రాగం: రేగుప్తి - తాళం: అట
పల్లవి:
ఈ సంశయము వారింపవే పరమేశ నన్ను మన్నింపవే ॥ఈ సంశయము॥
అనుపల్లవి:
శ్రీసదాశివ ప్రశ్న జేసెద వివరింపు
వాసుదేవ తత్త్వము మహత్త్వము
భాసమానవిలాస నేనిదె నీ సత్కృపావలోకనమున
నీ సమయమున దెలియవలసినదే సమస్తమిదే ప్రశస్తము ॥ఈ సంశయము॥
చరణములు:
జ్ఞానవిజ్ఞాన నిశ్చల భక్తివైరాగ్యానందములకు నిధానమైన విన్న
శ్రీనిలయమై వెన్నవలె మృదువై యసమానమై నుతిగన్న మార్గము మిన్న-
యైన బహుగోప్యతరమైన యనూనముగ సెలవిమ్ము చంచల-
లే నితంబినులనకు నే నీదాన దానవవైరి మ్రొక్కెద ॥ఈ సంశయము॥
వారిజాక్ష జగదాధారమూర్తియైన శ్రీరామునియందు సారసద్భక్తి
కారూఢమై ముక్తికారణమై యలరారు నొక్క యుక్తి నాదిశక్తి
మీరరసి ధీరరసికాళికి సారకళలూరఁ బలుకుము భవ-
నీరధికి తారకము భక్తిమీఱ సుజనులు వేఱె లేరని ॥ఈ సంశయము॥
దేవ శ్రీరాముని దేవదేవుగా షడ్భావాతీతునిఁగా సుధీవరులెల్ల
భావము రంజిల్లఁ బల్కుదు రతని భావింతు రదియెల్లఁ గల్లగాదె
గావునను శ్రీవిభుఁడు ముక్తికి కేవలము తావలమటైనను
శ్రీవెలయు భూవలయమున తనుభావుఁడై జీవుఁడైనదేమి ॥ఈ సంశయము॥
మాయావృతుఁడై రామస్వామి సన్ముక్తిదాయకునిగను తను దాఁ దెలియలేఁడు
వేయేల నతఁడు జూడు ఆత్మను తత్త్వవేత్తలకే నేఁడు దెలిపినాఁడు
మాయకుఁడటందు రొకకొందఱదే యథార్థము సేయ సుజన-
ధ్యేయుఁ డెటులగు నైన జానకి కాయెడలఁ దానడల నేటికి ॥ఈ సంశయము॥
ఈ వాక్యముల కర్థమీవుగా కితరులు భావించి పలుక నేర్పరులెవరు లేరు
దేవుఁడవై చెలువుమీఱు నిన్ను జేరు ధీరాత్ములు గోరు కోర్కెలీడేరు
ఈ వసుధ శేషశైలాధిపుఁడై వెలుఁగు రాఘవు చరితము సు-
ధావర్షమై చెవులపండువు గావించు సేవించు జనులకు ॥ఈ సంశయము॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi