| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| నారదుఁడు సత్యకుఁ బుణ్యక వ్రత ముపదేశించుట | ||
| చ. |
అతులిత తావకీన మహిమాతిశయోచిత మైన పుణ్యక వ్రత మొనరింపఁగా వలయు వారిజలోచన! నీవు; న య్యరుం ధతియును గౌరియు న్శచియుఁ దత్పరబుద్ధి నొనర్చువేళఁ జూ చితి మును తద్విధం బెఱుఁగఁ జెప్పెద నే నిపు డానుపూర్విగ\న్. |
55 |
| చ. |
తెలతెలవాఱ మౌననియతి న్నదికిం జని, తీర్థ మాడి, ని ర్మల వసనంబు గట్టి, నవరత్న విభూషణము ల్ధరించి, మైఁ గలప మలంది క్రొమ్ముడిని గ్రమ్మవిరు ల్సవరించి, యత్తమా మలకును నాత్మభర్తకు నమస్కృతి సేసి, తదీయసమ్మతి\న్. |
56 |
| చ. |
కువలయనేత్ర! తొంటి తనకోపము గర్వము మచ్చరంబు మా ని, వినయముం బ్రమోదమును నిండి తొలంకెడు నెమ్మనంబున న్సవతులయిండ్ల కెల్లఁదొలునాఁడు క్రమంబున నేఁగి, త ద్వ్రతో త్సవమున కామతించి యతిసంభ్రమలీలలఁ దోడితేఁ దగు\న్. |
57 |
| చ. |
దినదిన మిట్లు తత్పరమతిం బదివేవురు పేరఁటాండ్ర క ర్చన లొనరించి సార ఘనసార సుగంధములు న్విచిత్ర నూ తన పట రత్నభూషణ వితానము లిచ్చుచు వేడ్కఁ జైత్రశు ద్ధ నవమి యాదిగా నెల వ్రతం బొనరించిన యంతమీఁదట\న్. |
58 |
| మ. |
పరమాచారధురీణు, నధ్యయన సంపన్ను, న్శుభాకారు, శా స్త్రరహస్యజ్ఞు, విశిష్టవంశజుఁ, బ్రశాంతస్వాంతు, నుద్య ద్దయా పరతంత్రు న్విదితాత్ము, భూసురవరుం బ్రార్థించి యాచార్యుఁగాఁ దరళాక్షీ! నియమింపఁగాఁ దగు వ్రతోద్వాస క్రియావేళకు\న్. |
59 |
| శా. |
ఆరీతి న్నియమించి యీవలయు మాద్యద్దంతి వాహావళుల్ నారీరత్నచయం, బనర్ఘ నవరత్న శ్రేణి గో భూ పరీ వారంబుల్ ధనధాన్యసంతతి, రసవ్రాతంబుఁ, గర్పూర క స్తూరీ సంకుమదాగురు క్రముకరాసు ల్కోటి సంఖ్యాకముల్. |
60 |
| శా. |
ఏతద్వస్తు సదక్షిణాకముగ నాత్మేశు న్సురానోక హా న్వీతుంగాఁ దగ ధారవోసి, ద్విజుఁ డేయేయర్థము ల్వేఁడినం జేతఃప్రీతిగ నిచ్చి, క్రమ్మఱఁ బతిం జేకొంట యుక్తంబు; వి ఖ్యాతంబై తనరారు నీవ్రతము సాకల్యంబుగాఁ జేసిన\న్. |
61 |
| క. |
ధన కనక వస్తు సమితియుఁ దనయ సమృద్ధియును గల్గి తానుం బతియు\న్ మనమున నఱగొఱ లెఱుఁగక యనితర సులభైక సుఖము లందుదు రనుచు\న్. |
62 |
| క. |
నారదుఁడు పుణ్యక వ్రత మారూఢిగ నెఱుఁగఁ జెప్ప నవహిత మతి యై కోరిక లిగురొత్తఁగఁ ద త్ప్రారంభ మొనర్చె సత్య ధవుని యనుజ్ఞ\న్. |
63 |