| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| పారిజాత తరు ప్రతిష్ఠ | ||
| తే. |
ప్రాణవిభుఁ బెక్కుమాఱులు ప్రస్తుతించి మంది రారామ వాటికా మధ్యసీమ దివిజ భూమీరుహంబుఁ బ్రతిష్ఠ సేసి యర్హపూజన మొనరించె ననుదినంబు. |
50 |
| చ. |
సతులఁట! ప్రాణనాథులఁట! సారెకు నైక్యము లైన మోహసం గతులఁట! యేమి సెప్ప! బలఘస్మరుఁ బోర జయించి కల్పక క్షితిరుహము న్నిజేశ్వరికిఁ గృష్ణుఁడు దానిటఁ దెచ్చెనంచు సం స్తుతు లొనరించి రొండొరులతో సవతు ల్పదియాఱువేవురు\న్. |
51 |
| సీ. |
విరివిగా నొకవేళఁ బెరిఁగి వీటికి నెల్ల - నిజశీతలచ్ఛాయ నిగుడఁజేయుఁ, బిన్నగా నొకవేళఁ బెనువ్రేలియంత యై - చూడ్కుల కెంతయు వేడ్క సేయు, నింతగా నొకవేళ వివిధ భూరుహ పుష్ప - సురభిగంధంబుల సోడు ముట్టు, వేర్వేఱ నొకవేళ వికచ కాంచన రత్న - పరిపక్వ ఫలములఁ బరిణమించు, |
|
| తే. |
నభిలషించిన రూపంబు నభినయించు, నుల్లమునఁ గోరుకోరిక లెల్ల నొసఁగు సత్యభామాగృహారామ నిత్య మైన పారిజాతంబు విస్మయాపాది యగుచు. |
52 |