| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | చతుర్థాశ్వాసము |
| ఎండవేడిమి | ||
| మ. |
అనుచుం గాంతలు వల్లికా రచిత డోలాందోళన ప్రక్రియం గనకాంభోరుహ కర్ణికా హృతిఁ బరాగ క్షేప లీలాగతి న్వనకేళి పరతంత్ర వృత్తి దిరుగ న్మార్తాండ బింబంబు ని ల్చె నభోమధ్యమునం గఠోర కిరణ శ్రేణీ దురాలోకమై. |
17 |
| చ. |
వదలిన నీవిబంధముల, వాడినమోముల, జాఱుకొప్పులం జెదరిన పత్రభంగములఁ, జిక్కులుగొన్న మణీసరంబులం బొదలిన యూర్పుఁ దెమ్మెరలఁ, బుప్పొడిఁ గెంపగు వాలుఁ గన్నులం ద్రిదశ మృగాయతాక్షులు రతిశ్రమ ఖిన్నలఁ బోలి రందఱు\న్. |
18 |
| క. |
బెడిద మగు నెండసోఁకునఁ దొడిమలు వసివాడి ననలు దొరఁగె లతల నె ల్లెడ వనదేవతమేనం బొడమిన లేఁ గమ్మఁ జెమటబొట్టు లనంగ\న్. |
19 |
| శా. |
తూఁగెం జల్లనిగాడ్పులేమి ఫణిసందోహంబు పేరాఁకట\న్, లోఁగెం దప్త సరోజ శీథురసముల్గ్రోల న్మదాళిచ్ఛటల్, గ్రాఁగె న్నీఱుగఁ గాంచనాచల తటీ గండోపల వ్రాతము ల్డాఁగె న్బల్వల పంకసీమ బకజాల త్రస్తపాఠీనముల్. |
20 |
| చ. |
కనుఁగవ మ్రాన్పడంగ, నెఱక ల్విరియంబడ, బోర మోప నెం డిన వదనంబులం దెఱచి, నిక్కిన యఱ్ఱులు తల్లడించుటల్ గనఁబడ, నూరుపు ల్దళముగా నిగుడ న్వడఁ గుంది యీరెలుం గునఁ దమవానిఁ బిల్చుచు శకుంతము లయ్యెడ నిల్చె మ్రాఁకుల\న్. |
21 |
| చ. |
ఒకయెడఁ జక్రవాకము పయోరుహమిత్రుని వేడియెండచేఁ దెకతెకఁ గ్రాఁగు తమ్మివిరి తేనియ ఱెక్కలఁ జల్లనార్చి కాం తకుఁ దనివార నిచ్చెఁ బరితాపము వాయ మృణాళ వల్లరీ శకలము మాటికిం గమిచి చంచుపుటంబున నంది యిచ్చుచు\న్. |
22 |
| తే. |
ఆతప గ్లాని బడలిన యభ్రమువును నిజ కరాగ్ర జలంబుల నెఱయఁజల్లి శ్రవణయుగ తాలవృంత సంజాత శీత వాతములఁ దేర్చె గీర్వాణ వారణంబు. |
23 |