| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ప్రథమాశ్వాసము |
| నారదుఁడు శ్రీకృష్ణుని దశావతారముల నుతించుట | ||
| సీ. |
ప్రామినుకుల దొంగఁ బాతాళ కుహరంబుఁ - జొరఁ బాఱి చీఱిన చోఱ వీవ, తరిగొండ వెన్నుపైఁ దాల్చి వేల్పులఁ గూటి - చవి దేల్చినట్టి కచ్ఛపమ వీవ, నీటిలో మునిగిన నేలచేడియఁ గొమ్ము - కొన నుబ్బ నెత్తిన ఘోణివీవ, మునిమాపు బలు గంబమునఁ ముట్టి బంటు న - క్కఱఁ గాచినట్టి సింగంబ వీవ, |
|
| తే. |
దితిజు మెట్టిన యా పొట్టి దిట్ట వీవ, పుడమిఱేఁడుల నడఁచిన ప్రోడ వీవ, కడలిఁ గోలకుఁ దెచ్చిన గబ్బి వీవ, యిపుడు ద్వారక వసియించు నీవు నీవ! |
49 |
| క. |
రక్కసిమగువల యీలువు మొక్కపఱిచె దీవ, పాపముల గమి కాలం ద్రొక్కెదవు నీవ, యింకిట నిక్కముగా నిన్నుఁ బొగడ నేర్తునె! కృష్ణా! |
50 |
| క. |
ద్వారక వైకుంఠపురం బీ రుక్మిణి లక్ష్మి, మీర లిచ్చట నునికిన్ సారెకుఁ గొల్వఁగ వత్తును గోరికతోఁ గంసహర! ముకుంద! మురారీ!" |
51 |