| వ. |
అంతట బ్రహ్మానంద జలధిలో నోలలాడుచున్న ప్రహ్లాదునిఁ జూచి యతని చిత్తశుద్ధి
లోకులకుఁ దెలియఁ జేయుటకై తలఁచి నిజ భక్తజన సంభాషణమందు నాసగలవాఁడై
శ్రీమన్నారాయణమూర్తి పలుకున దెట్టులనిన. |
| శ్లో. |
అరసికజన సంభాషణతో
రసికజనేషు వాక్కలహః శ్రేయః॥ |
| క. |
తలపున మోక్షదుఁడగుచును
వెలుపటి కా శుద్ధిగలిగి వేడుకగాగన్
తెలియని లోకులకెల్లను
జెలరేగుచు వాదులాడఁ జక్రియు దలఁచెన్. |
| వ. |
శ్రీహరి ప్రహ్లాదునిఁ జూచి పలుకు వాక్యం బెట్టులనిన. |
| ఉ. |
ఎప్పుడు పూర్ణకామి సుఖి హెచ్చుగ వేల్పుల కాదిమూలమై
చెప్పతరంబుగాదు తన చేతన జన్మములే మతజ్ఞులో
గొప్ప తపంబొనర్చుచును కోర్కెల నిమ్మన సంతసిల్లుచున్
తప్పక నిత్తు సంపదలు దానవ పుత్ర వరంబులందుకో. |
| వ. |
ఈలాగున శ్రీమన్నారాయణుఁడు ప్రహ్లాదునిఁజూచి కామ్యవరము లందుకొమ్మనిన
వార్తలు విని సహింపక యెదురు పలికినది యెట్టులనిన. |
| క. |
ఆనాటి దాహమెల్లను
నేనార్చగ నిన్నుఁజూచి నేర్పునమదిలో
బానకపు పుల్లరీతిని
హీనంబగు వార్తఁబలుక నిది సమయంబా. |
| క. |
సదయామర తరువునుఁ గని
ముదమునఁ బొక్కడుగఁ బోవు మూఢుఁడు గలఁడా
మొదలైన వేల్పు లెఱుఁగని
పదములఁగని విడువఁజాలఁ బదిమారులకున్. |
| వ. |
ఇవ్విధంబున బలికి తిరుగ శ్రీహరినిఁ జూచి పలుకుటెట్టులనిన. |
| క. |
స్వల్పము లడుగనుఁ జూచుట
కల్పాంతరమైన తృప్తిగాదయ మదిలోఁ
గల్పన చాలు బిలేశయ
తల్పామర వినుత! బ్రోవు తాళను నేనున్. |
| వ. |
ఇవ్విధంబున బ్రహ్మజ్ఞాన నిష్ఠుడై పలికిన ప్రహ్లాదునిఁ జూచి
పరబ్రహ్మమైన శ్రీమన్నారాయణమూర్తి పలుకునది యెట్టులనిన. |
| సీ. |
మాయల దేహాభిమానంబుల జయించి - వర్ధిల్లునట్టి నీవంటివాని
గని యభీష్టములిచ్చి కరుణతో భువి - చక్రవర్తిగాఁ జేసి నే వరములిత్తు
స్వల్పమైనట్టి యాస్వర్గ భోగములకై - భువిలోన జపతపంబుల నొనర్చు
కామార్థులకు నేను కలనైనఁ గాని కన్ప - డను పామరులకేపాటి వినుము
బాల సతతంబు నీ రాజ్య పాలనంబు - సల్పగాఁ జూచితే గాని శమముగాదు
కొమ్ము నీ హృద్గతంబైన కోర్కెలెల్ల - స్వస్థచిత్తుండవై యుండు స్వపురమందు. |
| వ. |
జగదీశ్వరుండు తిరుగ బలుకునది యెట్టులనిన. |
| ద్వి. |
భవసుఖంబుల కాసపడుచు నీ ధరను - అల జపధ్యాన పూజాది కర్మముల॥
నొనరించుచును నగ్నినొక కాలనిలచి - ఘనవేషములఁ దాల్చి గాసందు జనుల॥
గన నాస గొనదయ్య కడుభూతమైన - తనకు వారికి మంచితనమదెన్నటికి॥
నిర్మలచిత్తులై నిఖిలజ్ఞులైన - ధర్మకర్మాదులఁ దప్పి లయించి॥
దేహాశ వీడి విదేహులైనట్టి - సోహంబనుచు మదిసొంపు మీరంగ॥
ప్రజలు తానీవంటి బ్రహ్మనిష్ఠులకు - దెబగుబలుగ గడిదేరి యెదురౌచు॥
వలసి యొల్లని వరము వరుసగా నొసఁగి - యిలను దైత్యులఁబట్టి యిపుడు నేఁ దునిమి॥
యెల్లకాలము భూమినేలగాఁ జేతుఁ గొల్లగా వరముఁ జేకొనుము ప్రహ్లాద॥ |
| వ. |
ఈలాగున తన దయకుఁ బాత్రుఁడని యెంచక నిర్దయుని వలెనే పలికిన
శ్రీహరినిఁ జూచి ప్రహ్లాదుఁడు అత్యంత దీనుఁడై యానంద బాష్పధారాసిక్త
కపోలుండై పలుకునది యెట్టులనిన. |
| క. |
దీనార్తి భంజనుండని
యానాడే కీర్తినీకు హెచ్చెను కనవే
నీ నోము సేయువాఁడని
శ్రీనాయక నాదుపైనఁ జింతయు లేదే. |
| వ. |
ప్రహ్లాదస్వామి తిరుగఁ బలుకున దెట్టులనిన. |
| క. |
కద్దని నమ్మిన భక్తులఁ
బద్దునఁగని నీదుమనసు పాకంబగునే
సద్దయుఁడ వైతివైనను
చద్దన్నపు మీదివెన్న చందమునగునే. |
| క. |
వంచన సేయకు నాయెడఁ
గొంచెతనంబదియు నీకు కోదండధరా
మంచిది నీ నడతలు వ
ర్ణించెద నిను నిర్మలాత్మ నీరజనయనా. |
| వ. |
ఈలాగున శ్రీహరి గుణానుభవంబులను ప్రహ్లాదుండు వర్ణించునది యెట్టులనిన. |
| వ. |
ఇవ్విధంబునఁ గనులు కలంగగ నంతరంగము కరంగగఁ బలికిన ప్రహ్లాదునిఁ
జూచి కపటపు చిరునవ్వెలయ శ్రీహరి పలుకున దెట్టులనిన. |
| చ. |
కపటపునవ్వుగాగఁ జిఱకాలము లింద్రియ నిగ్రహంబుచేఁ
దపమొనరించువారలకుఁ దప్పవు భోగము లింద్రసౌఖ్యముల్
అపరిమితాపదల్ మదిని నార్చుచు ధైర్యముసేయు నీదుపై
కృపగల వాఁడనైతి బహు కీర్తిగ సంపదలీక తీరునే. |
| వ. |
తిరుగ శ్రీహరి కపట వాక్యములు పలుకున దెట్లనిన. |
| క. |
నీకొక మర్మము దెలిపెద
లోకుల కరుదైన నిధుల లోకువసేతున్
చేకొనుము చనెద దూరము
నాకోర్కెలు నాదుపనులు నానావిధముల్. |
| వ. |
ఈలాగున నెడబాయఁదలచి పలికిన శ్రీహరి వాక్యములను వినఁగనే
ప్రహ్లాదుండతి వ్యసనాక్రాంతుఁడై పలుకున దెట్టులనిన. |
| క. |
చనవలెనను వార్తనువిని
కనులను బాష్పములురాలఁ గడు దుఃఖముతో
వనరుహనయనునిఁ జూచుచు
దనుజార్భకుఁ డడలుకొన్న తరి యెట్లన్నన్. |
| ద్వి. |
ఏ యాలి సుతులకై యెవరిపైకాలకు - నాయాసమగు తపంబమరఁజేసితిని॥
ఏ శత్రువర్గాలకే రాజ్యములుగోరి - యాసించి నే తపంబమరఁజేసితిని॥
ఏ దేవతలగోరి యేజలంబులలోన - ప్రాదేశకుక్షియై ప్రార్థించుకొంటి॥
ఏ యాపదలను నేనెఱిగి తాళితిని - మాయావిలాస నామది నెఱుగలేవ॥
నిను సుఖదుఃఖముల్ విశ్వమంతయును - నిను వినాయెవ్వరే నిఖిలభావజ్ఞ॥
న్యాయమా నీకు నన్యాపదేశముగఁ - బాయనెంచుచు మాటఁ బల్కితివిపుడు॥
తాళదు యీమాట తాళదే మనసు - వేళగాదిది వేదవేద్య మ్రొక్కెదను॥ |
| క. |
ఎడబాయఁ దలచినావిక
విడువను నాతండ్రి నిన్ను వేమరుమదిలో
జడియక నీపదయుగముల
దడసేయక కట్టివేతు దాళను నేనున్. |
| వ. |
ఇవ్విధంబున ప్రహ్లాదుండు తన నిజహృదయ మర్మంబు దెలిపి
మఱియు శ్రీహరినిఁ జూచి పల్కునది యెట్టులనిన. |
| ఉ. |
పున్నమనాటి చందురునిఁబోలు ముఖంబునుఁ జూచి చూచి యో
పన్నగశాయి యో దనుజభంజన నన్ను యెడబాయకంచు దాఁ
బన్నుగ వేడుకొంచు నిజ భక్తిని నిమ్మని జాలిజెందుచున్
కన్నుల నీరుతో నసుర కాంతజుఁడా హరి సేవసేయగాన్. |
| వ. |
ఇటువలెఁ బలికి యూరకున్న ప్రహ్లాదుని జూచి శ్రీహరి పలుకున దెట్టులనిన. |
| క. |
ముందటి భక్తుఁడు నీవని
ముందరనే ఖ్యాతిగాను మోదముతోడన్
అందరు బల్కగఁ జేసితి
నిందున నీకన్న భక్తులెవ్వరుఁ గలరే. |
| వ. |
ఇవ్విధంబునఁ బలికిన శ్రీమన్నారాయణునిఁ జూచి సమయమనుచుఁ
దెలిసి పలుకున దెట్టులనిన. |
| క. |
స్వర్ణమయాంబర శ్రీకర
వర్ణాభయహస్త మత్తవారణశరణా
కర్ణింపుము నామనవి సు
పర్ణునివలె భక్తినిమ్ము పదిమారులకున్. |
| వ. |
ఇటువలె వైనతేయునివలెఁ బరిచార భక్తినిమ్మనిన ప్రహ్లాదునిఁ జూచి
శ్రీమన్నారాయణుండు పలుకున దెట్టులనిన. |
| క. |
అజశక్రాదు లెఱుంగని
నిజ భజన పథంబు దెలిసి నిశ్చయమనుచున్
గజవరదుఁడు యోచించి స
హజమున ప్రహ్లాదుఁజూచి యమరగఁ బలికెన్. |
| సీ. |
సరిసమానము నిను సల్పంగఁ బూనిన - బరిచారకముసేయు బ్రతుకదేల
నేర్పైన దృఢభక్తి నేనెఱుంగలేక - యెన్నగా నీ నిజం బెందు లేదు
నలువక్రిందుకైన నాదివ్యరూపంబుఁ - గన దూరమైయుండుగాని ధరను
నీ స్నేహరజ్జుచే నిండారఁ దగిలి నే - నీకు వశ్యుఁడనైతి నిర్మలాత్మ
సత్వగుణభక్తికిపుడు నే సాక్షిగాద - నీకుఁ బలుమారు నడుగంగ నీతిగాదు
యన్యమైనట్టి యధికార మడుగవయ్య - ఖ్యాతిమీరంగ నొసగెదఁ బ్రీతితోడ |
సనకాదయః ॥రాజన్‌పతి గురురయం॥
(సనకాదులు "రాజన్‌పతి గురురయం" అను కీర్తనము పాడుదురు) |
| వ. |
ఈలాగున పలికిన శ్రీమన్నారాయణునిఁ జూచి ప్రహ్లాదుండు పలుకున దెట్టులనిన. |
| క. |
ధర్మార్థ కామమోక్షము
భర్మాంబర తనకుఁ గలుగు భక్తియువలెనే
శర్మంబులెల్ల దొరుకును
నిర్మలమగు భక్తినిమ్ము నిన్నే కొలుతున్. |
| శ్లో. |
నాస్థాధర్మే న వసునిచయే నైవ కామోపభోగే
యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం
ఏతత్ప్రార్థ్యం మమ బహుమతం జన్మజన్మాంతరేపి
త్వత్పాదాంభోరుహ యుగగతా నిశ్చలాభక్తిరస్తు॥ |
| వ. |
తిరుగ ప్రహ్లాదస్వామి పలుకున దెట్టులనిన. |
| క. |
తెగనాడు మాటలెందుకు
నగధర సరివారిలోన నగుబాటుగదా
వగలెల్లఁ జూపి నాయెడఁ
బగసేయుట కేమిఫలము భక్తాధీనా. |
| క. |
నాలోని జాలిఁదెలిసియు
నీలాగు బరీక్ష సేయనేలా మేలా
చాలా ధర్మము గాదికఁ
బాలించుర వేగ నన్ను భావజజనకా. |
| వ. |
ఈలాగున ప్రహ్లాదుండు అత్యంతజాలిచే శ్రీహరినిఁ జూచి మఱియు బలుకున దెట్టులనిన. |
| వ. |
ఈలాగున సీతాభక్తి నిమ్మనుచు ప్రహ్లాదుడు శ్రీహరినిఁ జూచి తనమదిలో నీశ్వరుండు
మానాభిమానంబులు లేని పరవస్తువని తెలిసి శపథంబు చేయునది ఎట్టులనిన. |
| క. |
వేడెద, మ్రొక్కెద, ననుఁదెగ
నాడక శపథంబు వినుము నారదగురుఁడా
నాఁ డుపదేశించినదే
పోడిమిగా సత్యమైనఁ బోరాడకురా. |
| వ. |
ఈలాగునఁ బలుకుచు తిరుగ ప్రహ్లాదుండు |
| క. |
తల్లినిఁగను పుత్రునివలె
నుల్లం బానందమంది యోహోయనుచున్
ఝల్లను తనతో హరిపద
పల్లవముల వ్రాల హరియు బాహునఁ బట్టెన్. |
సనకాదయః ॥భవాబ్ధిమంతి॥
(సనకాదులు "భవాబ్ధిమంతి" అను కీర్తనము పాడుదురు) |
| వ. |
ఇవ్విధంబునఁ బాదాక్రాంతుఁడైన పరమభాగవతాగ్రేసరుండును, భక్తవారిధి చంద్రుండునుఁ,
బరవశుండునునగు ప్రహ్లాదునిఁ జూచి శ్రీమన్నారాయణమూర్తి యేమి చేయుచున్నాఁడనిన. |
| క. |
పంకజ నేత్రుఁడు భక్తవ
శంకరుఁ డాద్యంతరహిత శాంతాకారుం
డంకమున నుంచి ప్రేమనుఁ
గంకణములు ఘల్లనంగఁ గౌగిటఁజేర్చెన్. |
| సనకాదయః (సనకాదులు) |
| శ్లో. |
యది హాస్య ప్రియాఖ్యాతః నకుర్మి సదృశం ప్రియం
ఏష సర్వస్వ భూతస్తు పరిష్వంగో హనూమతః॥ |
| వ. |
అంతట శ్రీహరి ప్రహ్లాదు నుపలక్షించి పలుకున దెట్టులనిన. |
| క. |
జ్ఞానము వైరాగ్యము వి
జ్ఞానము సద్భక్తి సమముగాగ భవుని నే
గానను ముల్లోకములన్
మాన్యుని నినుఁగంటి నీ సమానంబెవరే. |
| ద్వి. |
వినవోయి ప్రహ్లాద విమలాంతరంగ - వినఁగోరి నీ పల్కు వివరంబుగాగ॥
చలమున వాదంబు సల్పితి విపుడు - సలలితమతినైతి సంతోషినైతి॥
నీకోర్కు లెల్లను నిజముగఁ గల్గు - నేఁ గోరు పనులెల్ల నెరవేరె నిపుడు॥
సుఖమున వర్ధిల్లు సురవైరి తనయ - అఖిలాండములనేలు మాచంద్రసూర్య॥
స్థాయిగా విలసిల్లు సానందముగను - హాయిగానుండు నీవారోగ్యమునను॥ |
| వ. |
ఇటువలె తన స్వాభీష్టముల నొసంగిన భక్తపరాధీనునిఁ, బరమ పురుషుని,
చరాచరరూపుని, శంఖచక్రాంకితాజాను చతుర్బాహుని, పుండరీకాయతాక్షుని,
పురాణపురుషుని, శరణాగతవత్సలుని, జగన్మోహనాకారుని, దివ్యతేజోమయుని,
దివ్యపీతాంబర వనమాలాధరుని, ఆదిమధ్యాంత రహితుని, అఖిల జగత్పూజ్యుని,
ఆత్మారాముఁడగు శ్రీమన్నారాయణమూర్తిని ప్రహ్లాదుండు షోడశోపచారములచేఁ
బూజించుచు బ్రహ్మానంద పరవశుఁడై పలుకునది యెట్టులనిన. |