| భాష | ఛందస్సు | ఛందోదర్పణము చతుర్థాశ్వాసము |
ఛందోదర్పణము - అనంతామాత్యుఁడు - చతుర్థాశ్వాసము
| దోషాధికారము | ||
| క. |
శ్రీధర తనురుచివిజితప యోధర యనవరతఘోషయోషిత్పరిపీ తాధర తల్పీకృతవసు ధాధర రిపుభయద ఘనగదాధర కృష్ణా! |
1 |
| క. |
జగమున దోషవివర్జిత ముగఁ జెప్పఁగవలయుఁ గావ్యమ్ములు సత్కవు ల ట్లగుట\న్ దశదోషమ్ములు తగఁ జెప్పెదఁ బూర్వకవిమతంబుగఁ గృష్ణా! |
2 |
| గీ. |
పదియుఁ గీడుఛందోయతిభంగములు వి సంధికము పునరుక్తి సంశయ మపక్ర మంబు వ్యర్థ మపార్థము మఱి విరూపి తాపశబ్దవిరోధంబు లనఁగ గృష్ణ! |
3 |
| దశదోషములు | ||
| 1. ఛందోభంగము | ||
| క. |
ఛందోభంగం బగు గురు వొందెడునెడ లఘువుగాఁ బ్రయోగించుట గో వింద యనిపలుకుచోట ము కుంద యనుచుఁ బలుక నిట్లు కుంజరవరదా! |
4 |
| 2. యతి భంగము | ||
| ఆ. |
విమల కమలనేత్ర విశ్వలోకస్తోత్ర విమలదైత్యకులవినాశ యనుచు వలయుచోట లేక వడి యొండుచోనుండఁ బలికిరేని నియతిభంగ మండ్రు. |
5 |
| 3. విసంధికము | ||
| ఆ. |
అమృత ఉదధిశయన అమర ఈశానుజ అబ్జమందిరాస్య అబ్జమిత్ర అనుచు నిట్లు సంధి నెనయని శబ్దముల్ దొరకుటయ విసంధిదోష మండ్రు. |
6 |
| 4. పునరుక్తము | ||
| గీ. |
తొలుతఁ దా నెద్దియైననుబలికి మఱియు నదియ పలికినఁ బునరుక్తి యండ్రు బుధులు శబ్ద పునరుక్తి పూర్వోక్తమైన శబ్దమైన నర్థపునరుక్తి యేకార్థమైనఁ గృష్ణ! |
7 |
| గీ. |
శబ్దపునరుక్తి యగుఁ గాంతిచంద్రుఁ డని వ చించి మఱి కాంతి చంద్రుఁ డటంచుఁ బలుక నర్థపునరుక్తి యగుఁ గీర్తి నమృతకిరణుఁ దని యశోమృగాంకుం డన నబ్జనాభ! |
8 |
| క. |
పునరుక్తి దోష మొందదు దనరుపదావృత్తి నభిమతంబుగ వీప్స\న్ జనువినుతాభీక్ష్ణ్యంబునఁ బొనరు క్రియాసమభిహారముననండ్రు హరీ! |
9 |
| సీ. |
ఈ వెన్నమ్రుచ్చు దా నిల్లిల్లు దప్పక - చొచ్చుఁ బొమ్మన వీప్స సొంపుమిగులు ఇటువచ్చివచ్చి నీవేల నిల్చితి కృష్ణ - యనిన నాభీక్ష్ణ్యంబు పొనరియుండు ఇమ్మిమ్ముశౌరికి నిమ్మపం దనఁ గ్రియా - సమభిహారంబు ప్రశంస కెక్కు నీ చక్కఁదనమును నీమంచితనమును - బ్రీతిఁ గన్గొని ధాత్రి వ్రేత లైరి |
|
| ఆ. |
దండకావనంబు తాపసు లనఁ బదా వృత్తి యుల్ల సిల్లు వినులకృతుల భూరిపుణ్యశీల పునరుక్తిలాలన ప్రకటపుణ్యశోభ పద్మనాభ! |
10 |
| 5. సంశయము | ||
| ఆ. |
కడఁగి వానిఁ గదియఁగాఁ గదా నేఁడు నీ కింతపట్టుగలిగె నిందువదన ఊరకున్నఁ గలదొకో యని సంశయా ర్ధముగఁ బలుక సంశయము ముకుంద! |
11 |
| 6. అపక్రమము | ||
| క. |
పదమున నాభికమలమున హృదయమునఁ బయోజభవ రతీశ్వరదివిష న్నదు లుదయించెం గమలా స్పదనకు నను వ్యుత్క్రమం బపక్రమ మయ్యె\న్. |
12 |
| 7. వ్యర్థము | ||
| క. |
మును దాఁ బలికినమాటకు ననుగుణములు గాక వ్యర్థ మగుమాటలతోఁ బెనఁచిన నది వ్యర్థంబనఁ జనుదోషం బనిరి కావ్యచతురులు కృష్ణా! |
13 |
| ఆ. |
త్యాగి వగుదు నీవు తారంబు వెట్టవు చేరి నిన్ను నడుగు వారు పెద్ద యింకఁ గీర్తి బ్రాతియే యని యొరుఁ బల్క వ్యర్థదోష మండ్రు వనజనాభ! |
14 |
| ఆ. |
ప్రేమ మెఱిఁగి వాఁడు బిగియుచు నున్నాఁడు వానిఁ గసనెయొల్ల వాడుఁ నాకుఁ గూర్పఁ దెఱఁగు లేదొకో నాఁగ విరహిణి యందు నిట్లు వ్యర్థ మమరుఁ కృష్ణ! |
15 |
| 8. అపార్థము | ||
| క. |
కరిచర్మము గైరికశిల సురగిరి యని సముదయార్థశూన్యపదంబుల్ బెరసిన నపార్థ మగు నది జరగు మదోన్మత్తబాలచరితలఁ గృష్ణా! |
16 |
| 9. అపశబ్దము | ||
| ఆ. |
కనుఁగొనంగ నాదికవులకావ్యంబుల లలితమైన లక్ష్యలక్షణముల రూఢిగాని పెఱవిరోధోక్తు లపశబ్ద సంజ్ఞికంబు లండ్రు జగతిఁ గృష్ణ! |
17 |
| వ. |
అవియెయ్యవియనినం గుసంధి, దుస్సంధి, చుట్టుంబ్రావ, వైరి వర్గంబు, కాకుదోషంబు, కుఱుచకాకు, తెనుంగునకుఁ జొరని సంస్కృతక్రియలంబెరయు దుష్ప్రయోగంబులు మఱియు నిట్టి గ్రామ్యంబు లెన్ని గల వన్నియు నపశబ్దంబులు వాని వివరించెద. |
18 |
| కుసంధి | ||
| క. |
మొదల నికారముపైన చ్చొదవి యకారముగ దీనియొడయం డిది యె ట్లొదవె ననక దీనొండయం డిదెట్లొదవె ననుఁ గుసంధు లిన శశినయనా! |
19 |
| దుస్సంధి | ||
| క. |
క్షితి స్వరసంధి నకారం బతిశయముగ నతఁడు నతఁడు ననుచో నతఁడు న్నతఁడు నని యూఁది పలికిన సతతము దుస్సంధి యండ్రు సత్కవులు హరీ! |
20 |
| చుట్టుఁబ్రావ | ||
| క. |
మొద లాఱు వడ్డి మూఁ డనఁ గదియింపక యెత్తి కట్టి ఖరమున నగువాఁ డిదె వచ్చెడి నన నెగ్గై యొదవిన యీచుట్టుఁబ్రావ లొల్లరు కృష్ణా! |
21 |
| వైరివర్గము | ||
| ఆ. |
తుదలు తెలుఁగుఁ జేసి యదికి పుష్పవిల్లు పరంగ భూరుహంపుఁబండ్లు నాక పుష్పవిల్లు నాఁగ భూరుహపండ్లు నా వైరివర్గ మండ్రు వనజనాభ! |
22 |
| ఆ. |
కోమటీండ్రునాఁగ భూమితీరనఁ బలు గ్రహము లనఁగ వానకాల మనఁగ వైరివర్గమైన వదల రిట్టివిలోక రూఢిఁ జెల్లునని సరోజనాభ! |
23 |
| ఆ. |
మొదలి తెలుఁగుపై సంస్కృతపద మొకండు జరగు లోకరూఢిని సమాసంబు చొరదు పూని ముజ్జగంబులు ననఁ బోలుఁ గాని యతఁడు ముజ్జగద్వందితుఁ డనఁగఁ జనదు. |
24 |
| కాకుదోషము | ||
| క. |
పొలుపుగఁ బొగాడదండలు లలన ముడిచిన\న్ మకార లాంఛనుఁ డొందె\న్ జలమునఁ జెఱాకువి ల్లన నల నిడుదలఁ గాకు దోషమండ్రు ముకుందా! |
25 |
| కుఱచకాకు | ||
| క. |
ఎలుఁగుపడ నీవు చెపుమా యెలిక వనుచు నసపడితిమి యెమి నివు నయెడ\న్ చలుఁజలు ననునిడుపులు గుఱు చలు సేసినఁ గుఱుచకాకు చను నిది కృష్ణా! |
26 |
| దుష్ప్రయోగము | ||
| క. |
సత్వరము నృపస్యపదం గత్వా యాతఁడు నిహత్య కంటకుల సఖీ భూత్వా మెలఁగెడు నన్నఁగ విత్వవిదులు దుష్ప్రయోగవిధ మండ్రు హరీ! |
27 |
| వ. |
సంస్కృత విభక్తులయ్యును దెనుఁగునకుఁ జెల్లు సుప్రయోగంబెట్టి దనిన. |
28 |
| క. |
నిక్క మగు సుప్రయోగము ధిక్కృతదురితాయ భగవతేఽస్తు నమో యం చక్కడ నీకును నమరులు మ్రొక్కుదు రని తిఙ్సుబంతములఁ గూర్ప హరీ! |
29 |
| 10. విరోధములు | ||
| క. |
సమయవిరోధమ్మును నా గమలోక విరుద్ధములును గాలవిరోధ క్రమము కళాదేశవిరో ధములును జొరకుండఁ జెప్పఁదగుఁ గృతుల హరీ! |
30 |
| సమయవిరోధము | ||
| క. |
సందులఁ గుండలముల్ గుడి సందిని శివలింగమును నొసల భూతియుఁ బెం పొందఁగ నొకదరిబేసి మ రుం దెగడెడు నన సమయవిరోధము కృష్ణా! |
31 |
| ఆగమవిరోధము | ||
| క. |
ఎక్కడిధర్మము హింసయ నిక్క మనుచు వృత్రవధకు నిర్జరపతియుం ద్రొక్కె దయపేర్మి ననవుడు నక్కడ నాగమవిరోధ మండ్రు ముకుందా! |
32 |
| కళావిరోధము | ||
| క. |
తాళము పట్టక చదువు\న్ బోలఁగఁ బుస్తకముజేత ముట్టక పాడు\న్ మే లితనిజాణతన మన నోలి నిది కళావిరోధ ముదధివిహారా! |
33 |
| దేశవిరోధము | ||
| క. |
బహుకూపతటాకోదక మహితము మరుదేశ మని సమర్థించిన ని మ్మహి నది దేశవిరోధా వహ మండ్రు కవీంద్రు లమృతవారిధిశయనా! |
34 |
| క. |
ఇట్టివి దశదోషము లనఁ బట్టగుఁ గృతులందు నివియ భాసురముగఁ జే పట్టుదురు ధీరు లొక్కొక పట్టున డెందమ్ము లలరఁ బల్కినఁ గృష్ణా! |
35 |
| క. |
పదిదోషంబులఁ దెలిపెడు నదనఁ బ్రయోగించినట్టి యవయోగములం దొదవవు దోషంబులు నీ సదమల నామములఁ గూడఁ జలుపుటఁ గృష్ణా! |
36 |
| క. |
క్రమమున నిటుచెప్పిన దో షములం దత్యుత్కటము విసంధిక మని రా దిమునులు తత్పరిహారా ర్థము సంధి సమాసములు దిరంబుగఁ జేర్తున్. |
37 |
| క. |
సంధిఁ దెలిపెడుచో సూత్రసమ్మతముగఁ దొలుతఁ బలికి చూపెడు వర్ణముల విసంధి నాటుకొనదు శ్లిష్టోచ్ఛారణంబుఁజేసి చూపునదియ నిశ్చయసంధిసూచకంబు. |
38 |
| షట్సంధులు | ||
| గీ. |
పరఁగు దుక్సంధి స్వరసంధి ప్రకృతిభావ సంధి వ్యజనసంధి విసర్గసంధి స్వాదిసంధి నా షట్సంధు లందులోనఁ బ్రకృతసంధి యన్నది యాంధ్రభాషఁ జొరదు. |
39 |
| తుక్సంధి | ||
| క. |
పదమధ్యదీర్ఘలఘువులు పదాంతలఘువులు ఛకారపరమై యూఁదు\న్ మది మ్లేచ్ఛుఁడు తుచ్ఛుం డనఁ ద్రిదశ చ్ఛత్ర మననీగతిని దుక్సంధిన్. |
40 |
| గీ. |
లలిఁ బదాంతదీర్ఘము వికల్పంబు నొందుఁ బుత్త్రి కాచ్ఛత్ర మాత్మజాఛత్ర మనఁగ నటఁ బదాంతదీర్ఘం బయ్యు నాఙ్ప్రయుక్తి నిత్య మాచ్ఛాదనం బని నెఱయ నూఁదు. |
41 |
| స్వర సంధి | ||
| క. |
ధర అఇఉఋలు సవర్ణము పర మగుచో దీర్ఘ మగు సువర్ణాద్రి యన\న్ శరధీంద్రుఁ డన జహూదక సరసి యనఁ బితౄణములు వెసం దీర్పు మనన్. |
42 |
| క. |
చెచ్చెర ఇఉఋలు మూఁటికి నచ్చు పరం బైన యవర లాదేశ మగు\న్ మెచ్చగ దధ్యన్నం బనఁ బెచ్చుగ మృద్వన్న మనఁగఁ బిత్రర్థ మనన్. |
43 |
| క. |
తగునేఅన మన నయనం బగుఁ బోఅ మనఁగఁ బవన మగు నైఅక నా నగు నాయక పౌఅకయన నగుఁ బావక ఏజవాప్తి నయవాయావల్. |
44 |
| గీ. |
సరవి నీలాల్గుపదమధ్యసంధులందు నప్రసిద్ధ మేకారాంత మైత్వమునకు నోత్వమునకు నౌత్వమునకు నొగిఁ బదాంత సంధి నగు విశేషంబు లేచంద మనిన. |
45 |
| క. |
గోశబ్దముపై నవఙా దేశమున గవాక్ష మనఁగ దీపించు నవా దేశము ద్యోశబ్దముపై నాశక్రుండు ద్యవధీశుఁ డన సత్సంధిన్. |
46 |
| క. |
రైశిఖరాచ్చున కాయా దేశం బగుసంధి రాయధీశ్వరుఁ డనఁగా గ్లౌశిఖరాచ్చున కావా దేశం బగుసంధి గ్లావుదీర్ణ యనంగన్. |
47 |
| క. |
మొదలిఅకారము ఇఉఋలు పొదవిన నేత్వమును నోత్వమును రేఫయుఁ బెం పొదవు సురేంద్రుఁ డనఁగ నీ రదోత్కరం బనఁగ సంధి బ్రహ్మర్షు లనన్. |
48 |
| గీ. |
ఇత్వ ముత్వ మోత్వం బైత్వ మౌత్వ మైదు నాది యై ఋకారము పరమైనచోట మహితకవ్యృద్ధి మన్వృద్ధి మఱి ద్యవృద్ధి యద్ది రాయృద్ధి గ్లావృద్ధి యనఁగఁ బరఁగు. |
49 |
| క. |
వశగతి ఋణపద మధికపు దశఁ బ్రవసనకంబళార్ణ దశవత్సతరా ఖ్యశిఖిభసంఖ్యపదంబులు రశిరస్కాకార మొంది ప్రార్ణాదు లగున్. |
50 |
| క. |
ఐలగునేఐ లోఔ లౌలగు నాద్యంతమునకు నఖిలైకవిభుం డా లలితైశ్వర్యుఁడు స త్యాలాపౌదనుఁడు భవమహౌషధ మనఁగన్. |
51 |
| గీ. |
అత్వమున కోతు వోష్ఠమంత్యమునఁ గదియఁ గలుగు నోత్వౌత్వయుగ్మ వికల్పసంధి ఆడఁ జెందె ఘనోతు వల్పౌతు వనఁగ నాఁగె బింబోష్ఠి నొక్క బింబౌష్ఠి యనఁగ. |
52 |
| అఙ్ప్రయోగ చతుష్టయము | ||
| క. |
అందముగ నీషదర్థము నం దాతుద నుత్వ మోత్వ మై యోష్ణ మగు\న్ జెంది క్రియా యోగము తుద యందలియత్వ మది యాత్వ మావన మనఁగన్. |
53 |
| క. |
ఇల మర్యాదాదులయం దలియత్వం బాత్వ మై పొదలు నాద్రి యన\న్ లలి నభివిద్యాదులయం దలియత్వము నాత్వమై పొదలునాద్రియనన్. |
54 |
| గీ. |
ఈషదర్థ మనఁగ నించుక యగుఁ గ్రియా యోగ మనఁగ సత్క్రియోపయుక్తి యంతదాకఁ యనుటయై చను మర్యాద యదియు ననుట యర్థ మభివిధికిని. |
55 |
| క. |
ఈనాల్గిట నుపసర్గయ కానఁ గలిగె సంధి యట్లుగావు ప్రకృతిభా వానుగతాకారము లవి జానుఁగ దెలుగునకుఁ జొరవు సంధికలియమిన్. |
56 |
| క. |
ప్రతిషేధాకారోత్తర గతశబ్దాద్యచ్యు లవి నకారము లగునా శ్రితులకుఁ బంకజనేత్రుఁ డ నతిదూరుం డనఁగ నతఁ డనాద్యంతుఁ డనన్. |
57 |
| వ్యంజన సంధి | ||
| క. |
పొడవగు దిగిభ మజంతము షడంగములు జగదరిష్టశాంతి సుబంతం బడరె ననఁ దృతీయము లల వడు వర్గవ్యంజనములపై నచ్సంధిన్. |
58 |
| గీ. |
షడృతుధర్మభూషిత తరుషండలక్ష్మి నిర్మలాబృద్ధదీర్ఘిక నిజవిశిష్ట వాగృజుత్వంబు భవదృషిత్వమున కమరె నాఁగ ఋత్వవర్గ వ్యంజనముల సంధి. |
59 |
| గీ. |
ఆదిఙఞణనమల పొల్లు లచ్చు లంట స్వస్వరూపంబ యగు ఋత్వసంధి నైన నడఁగు గుడి హలంతము నాఁ దిఙంతమన ని కోయణచి నా ననృజువనఁ గూడుఁ గాన. |
60 |
| క. |
పన్నుగ మకార హల్లగు సున్న మకార మగు నచ్చు సోఁక సమగ్రం బన్న మన ఋకారం బా సన్నమ్ముగ మృత్వ మగు రససమృద్ధి యనన్. |
61 |
| క. |
తమతమవర్ణంబుల ద్వి త్వము లగుఁ దత్తరుణి తత్తదర్థము తద్దా నము తద్ధనంబు తన్నయ నము నా నిటు వర్గములఁ దనరు వ్యంజనముల్. |
62 |
| సీ. |
వర్గహల్లుల చేరువను హకారము చతు - ర్ధాక్షరం బై సంధి నడఁగు నొండె మూఁడవవ్రాలతోఁ బోఁడిగ దీపింప - స్రగ్ఘార మనఁగ నజ్ఘల్లు లనఁగ షడ్ఢలంబులునాఁగఁ సకలజగద్ధిత - ప్రౌఢిమనాఁగకుబ్భస్తు లనఁగ నవియ స్రగ్హారంబు లనఁగ నజ్హల్లు ల - నంగ షడ్హలములు నా జగద్ హి |
|
| ఆ. |
తానువర్తను లనఁ గకుబ్ హస్తు లనఁగ శపరమైన వాక్శాంతి వాక్ఛాంతి యట్ల చపటహల్లులు మూఁటను జను విభాష ఛత్వమగుఁ దకారమునఁ దచ్ఛాఖయనఁగ. |
63 |
| గీ. |
లలిని దవ్యంజనంబుపై లత్వమునకు ద్విగతి తల్లీల యనఁగఁ దద్లీల యనఁగ నంచితసకార మడఁగును నడఁగును నడఁగకుండు నుత్థితం బుత్స్థితం బన నుండుఁగాన. |
64 |
| క. |
అనునాసికవర్గ వ్యం జనముల నిజరూప మొండె జరగుఁ దృతీయం బునఁ బ్రాఙ్ముఖంబు ప్రాగ్ముఖ మన వాఙ్నియమంబు వాగ్నియ మమనుచోటన్. |
65 |
| గీ. |
కచటతపహల్లు పంచవర్గద్వివర్ణ సలనిజాకృతి మీఁదియక్షరయుగముల యరలవలఁ దృతీయంబు వాక్తరుణివాక్స రంబు లనఁగ దృగ్దీప్తి దృగ్వ్రాత మనఁగ. |
66 |
| గీ. |
కపల ప్రథమయుగ్మ సకారగతులఁ దాన అపరయుగ యరలవతృతీయంబు తత్కృ తంబు తత్పుత్రి తత్సతి తద్గతియు జ గద్గురుఁడు సద్యశము నాఁ దకారహల్లు. |
67 |
| గీ. |
తచ్చమత్కృతి తచ్ఛాయ తజ్జలంబు తజ్ఝషము తట్టణాంకృతి తట్ఠకార ఘనతతడ్డోల తడ్ఢక్క యనఁగ రెండు వర్గముల ద్విత్వమొందుఁ దద్వ్యంజనమున. |
68 |
| విసర్గ సంధి | ||
| క. |
కపముఖయుగ్మములు విస ర్గపయిం బొడసూపి నిర్వకార మగు మనః కపట మనఃఖేదము లనఁ దపఃఫలం బనఁ దపఃప్రతాపం బనఁగన్. |
69 |
| గీ. |
కపల మొదలిరెం డ్లగు దుర్నిర్గుపరిసంధి షత్వ మగు దుష్పదంబు నిష్ఫల మనంగ జరగు దుష్కర్మ మనఁగ నిష్కర్మ మనఁగఁ జెల్లు దుష్పీత మనఁగ నిష్పీత మనఁగ. |
70 |
| క. |
పొలుపుగఁజటతాదియుగం బుల శషస లెనయ విసర్గపొందు నన\న్ వా శ్చలనముఛందష్టీకలు లలితయశస్తతి మిథశ్చలంబు లనంగన్. |
71 |
| క. |
అలరు నికారాదివిస ర్గలపై వర్గాపరాక్షరద్వయగణముల్ యలహవలు గదియ రేఫల్ గలియు హవిర్భుజధనుర్భలంబు లనంగన్. |
72 |
| క. |
మొదలి విసర్గలమీఁద\న్ బొదలిన శషస లవి యూఁదు భూరియశస్సం పద యనఁ గాసుమనష్ష ట్పదము లనఁగ నధిక మగు తపశ్శక్తి యనన్. |
73 |
| గీ. |
అవ్యయాంత విసర్గ వర్గాక్షరముల రెంట ణనమయలవహల రేఫ రేఫ గాక పెఱవర్ణములఁ గారకంబులట్ల గదియు స్వర్గజం బనఁగ స్వఃకాంత యనఁగ. |
74 |
| క. |
ప్రకటవిసర్గాదిస్వర మకారమునఁ గలసి యోత్వ మగు సంధిఁ దపో ధికుఁ డన విసర్గ చెడి వా క్ప్రకార మాప్రభృతిఁ గదిసి రజఆప్తి యగున్. |
75 |
| క. |
కలితేకారాదివిస ర్గులు స్వరములమీఁదఁ గదియఁగా రేఫలు సం ధిలు నర్చిరగ్ర మనఁగా నలవడు మఱి చక్షురింద్రియం బనఁగ మహిన్. |
76 |
| గీ. |
వర్గములఁ దృతీయచతుర్థ వర్ణములును ణనమలును యరలహవలు నొనరఁ గదియ వామపదవిసర్గాంతిమాద్వర్ణ మోత్వ మగు రజోగుణమన మనోహర మనంగ. |
77 |
| క. |
వెలయ నివర్ణాదివిస ర్గలమీఁదను రేఫ గదియఁగా దీర్ఘము వ ట్రిలి యర్చీరాజి యనఁగ నలిఁ జక్షూరాగ మనఁ దనర్చును సంధిన్. |
78 |
| క. |
ధర నవ్యయపు విసర్గకుఁ బరమున నచ్చున్నఁ గుఱుచపై రేఫ యగు\న్ పరరేఫ గదియ దీర్ఘ స్వర మగు స్వరధీశుఁ డనఁగ స్వారాజ్య మనన్. |
79 |
| గీ. |
ప్రథమశబ్దాంత దీర్ఘవర్ణములమీదఁ జతనమైన రేఫాంత విసర్గ యుండి రేఫయగుఁ దుది నచ్చున్న రేఫయున్నఁ గ్రాఁగు వారాకరంబు వారాశి యనఁగ. |
80 |
| క. |
అత్వాంతవిసర్గ యుడుగు నిత్వాదుల రత్వమొందు ఋత్వము తుదరా నత్వము తపఋద్ధి యనఁగ సత్వయుతా నిరృతియనఁ బ్రశస్తం బగుటన్. |
81 |
| క. |
తల మగు రేఫాంతవిస ర్గలమీఁద ఋవర్ణ మొనరఁగా సంధి విస ర్గ లుడిగి రేఫయు ఋత్వము గలిగియు బునరృతు సమేత కమలాక్షి యనన్. |
82 |
| గీ. |
స్వాదిసంధిలోపలి విసర్గాంతవర్ణ సంధు లెన్ని యన్నియును విసర్గసంధి యందె కలిసివచ్చుటఁజేసి స్వాదిసంధి వేఱ యొనరింపబడదు వివేకరూఢి. |
83 |
| వ. | మఱియు నొక్క విశేష సంధి. | 84 |
| క. |
ఉపరిని హల్సంయుతమై నపు డూఁదును స్వరసమన్వితాక్షర మగునే నపు డూఁద దాదివర్ణము ప్రపాద్వయము పరికృతంబు పరికౢప్తి యనన్. |
85 |
| సమాసంబులు | ||
| క. |
లలితద్వంద్వబహువ్రీ హులు తత్పురుషము నలుక్కు నుద్యద్ద్విగువు\న్ నలిఁ గర్మధారయము ని ర్మలావ్యయీభావమును సమాసము లరయన్. |
86 |
| వ. |
అందుఁ బూర్వపదార్థ ప్రధానంబవ్యయీభావంబు నుత్తర పదార్థప్రధానంబు తత్పురుషంబు నుభయపదార్థ ప్రధానంబు ద్వంద్వంబు నన్యపదార్థ ప్రధానంబు బహువ్రీహియు నగు నందు ద్వంద్వంబు. |
87 |
| ద్వంద్వము | ||
| క. |
పెక్కైనను రెండైనను జొక్కపుశబ్దములు గదియుచో ద్వంద్వ మగు\న్ మ్రొక్కెద బలకృష్ణుల కన నక్కిటికమఠాద్రు లుర్వి కాధార మనన్. |
88 |
| గీ. |
వ్యస్తపద మయ్యెనేని సమస్తమైన ద్వంద్వమున కంత్య పదము చందము విభక్తి అంబువులు గోవు ద్విజుఁడు శుద్ధాత్ము లనఁగ నంబుగోద్విజుల్ శుద్ధాత్ము లనఁగ నిట్లు. |
89 |
| గీ. |
చేయవలయు మాతాపితృసేవ యనఁగ మహితరుచులు సూర్యాచంద్రమసు లనంగ నాదిమునులు మిత్రావరుణాఖ్యు లనఁగ ద్వంద్వమున సంధిదీర్ఘము ల్వచ్చు నిట్లు. |
90 |
| క. |
అల సంస్కృతమునఁ బోలె\న్ వల దల్పాచ్చునకు నిచట ద్వంద్వపునియతుల్ తెలుఁగు లనుగ్రహనిగ్రహ ములు నాఁగను బుణ్యపాపములు నాఁ జనుటన్. |
91 |
| బహువ్రీహి | ||
| క. |
ఏవస్తు వెవ్వనికిఁ గల దావస్తువుకలిమి యతని కలవడఁ బలుకం గావలయు బహువ్రీహి శి రోవిలసద్బర్హిబర్హ రూఢవివేకా! |
92 |
| తత్పురుషము | ||
| గీ. |
ప్రథమపదమున కెద్ది విభక్తి దాని చే విశేషింపఁబడినది యా విభక్తి సంజ్ఞఁ బరఁగును దత్పురుషంబు కృతుల నదియు నఞ్పూర్వసహిత మెన్మిదివిధములు. |
93 |
| క. |
తగఁ బ్రథమాతత్పురుషం బగుఁ గాయముయొక్క పూర్వమపరము దెల్లం బుగఁ బూర్వకాయ మనఁగా నగణితముగ నపరకాయ మనఁగా వరుసన్. |
94 |
| క. |
కమలాశ్రితుండు ధనకృ త్యము కుండలకాంచనంబు ధామాగతుఁ డ ర్యమసుతుఁ డుపలస్థితచి త్ర మన ద్వితీయాదు లాఱు తత్పురుషంబుల్. |
95 |
| క. |
క్షితినఞ్తత్పురుషం బగుఁ బ్రతిషేధనకారమునకుఁ బ్రతియై మొదల\న్ వితతాకారము చొప్పడి యతఁ డబ్రాహ్మణుఁ డనంగ నవృషలి యనఁగన్. |
96 |
| ద్విగువు | ||
| క. |
ద్విగు వగు సంఖ్యాపూర్వక మగుచు సమానాధికరణ మగుచుఁ బ్రసిద్ధం బుగఁ గర్మధారయాహ్వయ మగుఁ దత్పురుషంబ యీక్రియ\న్ భిన్నగతిన్. |
97 |
| క. |
ఏయది సంఖ్యాపూర్వక మై యలవఁడు బలుక ద్విగుసమాసం బది దా నీయదుపతికీర్తిం దెలు పాయెఁ ద్రిలోకి యన నీసమాహారోక్తిన్. |
98 |
| కర్మధారయము | ||
| క. |
ఏమిటి కెయ్యది గుణమై తామెఱయుచు నుండు నది మొదల నిడి పలుక\న్ భూమి నది కర్మధారయ మౌ మధురోదకము మేచకాభ్రం బనఁగన్. |
99 |
| క. |
అందముగఁ గర్మధారయ మందు మహాత్మునకు నమరు నభియోగము గో విందుఁడు మహాత్ముఁ డనఁ జే యందు ఫలితకల్పలత మహాలక్ష్మి యనన్. |
100 |
| అలుక్సమాసము | ||
| క. |
ఏక్రియ యెవ్వనికిం దగు నాక్రియఁ దేరఁ బదమధ్యమందు విభక్తి ప్రక్రియఁ గూర్ప నలు క్కగు నీక్రియ ఖేచరవనేచ రేశ్వరు లనఁగన్. |
101 |
| అవ్యయీభావ సమాసము | ||
| క. |
ఎక్కడ నెయ్యవి లే వవి యిక్కడ లే వనిన నవ్యయీభావము దా నెక్కొను నిర్మక్షిక మని యక్కజ మగుఁ దీర్ఘ మహిమ నభినుతి సేయన్. |
102 |
| వ. | మఱియు నుత్తరపదోపమానసమాసం బెట్టి దనిన. | 103 |
| ఉత్తర పదోపమాన సమాసము | ||
| గీ. |
ఓలిఁబురుషసింహో యని యుగ్గడించు చోటఁ దా సింహఇవపురుషో యనంగఁ దనరు నిగ్రహ మగుట నుత్తరపదోప మానసమాస మండ్రిది శాస్త్రమహిమవిదులు. |
104 |
| కారక శబ్దంబులు | ||
| గీ. |
సంస్కృతము తెనుఁ గైనఁ దత్సమపదంబు దానఁ బుట్టి తెనుంగైనఁ దద్భవంబు దేశి తెనుఁగు దేశజ మచ్చ తెనుఁగు తెనుఁగు నిర్మలుఁడ సిరి యొడయఁడు నిక్క మనఁగ |
105 |
| గీ. |
సర్వనామముల్ యుష్మదస్మత్పదంబు లావిభక్తులక్రియ లవ్యయములు మానుఁ దెలుఁగు లగుచోటఁ గారకాదిని వసించి సర్వనామాశ్రయంబులు జరుగుఁ కొన్ని. |
106 |
| సీ. |
ఏనన్న నీవన్న నితఁడన్న బ్రథమాఖ్య - నను నిన్ను నాతని నన ద్వితీయ నతనిచే నతనితో ననఁగ దృతీయ యీ - తనికొఱ కతనికై యనఁ జతుర్థి పంచమి యగు దీనఁబట్టుండి యందుండి - వానికంటెను వానివలన ననఁగఁ వానియొక్కకులంబు వానికిఁ బ్రియ మది - జనులలో నితఁడు మేలనఁగ షష్ఠి |
|
| ఆ. |
జలధియందు లక్ష్మిగలుగుచుండఁగ దన్ని మిత్త మనఁగ సప్తమీవిభక్తి జలజనాభ యనఁగ సంబుద్ధి యిట్లు వి భక్తు లలరుఁ గారకోక్తిగతని. |
107 |
| క. |
స్త్రీపుంనపుంసకము లన నేపగు లింగములమీఁద నెసఁగు విభక్తుల్ దీపించు నవియు వచన వ్యాపారనిరూఢి నక్షరాంతరములతోన్. |
108 |
| క. |
తనరఁగ అఆఇఈ లనఁగా ఉఊలు నాఁగ నంబుజదళలో చన ఋౠ లన ఓఔ లనఁగ నజంతాహ్వయంబు లగు నీపదియున్. |
109 |
| క. |
చజలు తవర్గము పబమలు స్వజనప్రియ రవలు శషలు సహలు పదాఱు\న్ నిజమగు హలంతములు హరి యజంతములు గూడ నిరువదా ఱంతంబుల్. |
110 |
| క. |
అంతము తెలుఁ గగునెడ నే యంతముతలసూప దైన నచట సమాసా భ్యంతరములందు సంధ్యుచి రాంతము లగుఁ గాన ధీవియద్విష్ణులనన్. |
111 |
| క. |
యత్తత్ప్రభృతు లొకటితోఁ జొత్తెంచును యద్గుణంబు చూచి మహాత్ముల్ మెత్తురు తత్పురుషుఁడు లో కోత్తరుఁ డన నీదృశ ప్రయోగబలమునన్. |
112 |
| క్రియా పదంబులు | ||
| క. |
పరుఁ బలుకు బ్రథమ పురుష మె దిరి మధ్యమపురుషపలుకు ధృతి దనుఁ బలుకున్ ధర నుత్తమపురుషక్రియ వరుస నలింగము లైనవచనము లెసఁగున్. |
113 |
| క. |
కారకపదములు తెనుఁగై నారి నరుఁడు రత్న మనఁ దనర్చుగతి క్రియా కారవిశేషము లలరవు వారలు వచ్చెదరు దండు వచ్చెద రనుచోన్. |
114 |
| క. |
ద్వివచనము లేదు తెలుఁగున బ్రవిమలగతి నేకవచనబహువచనము లౌఁ దివిచెద ననఁ దివిచెద మనఁ గవి యనఁ గవు లనఁగ గ్రియలు కారకఫణితిన్. |
115 |
| అవ్యయ శబ్దంబులు | ||
| క. |
ఇలఁ గారకమట్టుల యు జ్జ్వలరూపము లయ్యు లింగవచనములు విభ క్తులు లేకవ్యయశబ్దం బులు సకలము సముచితార్థములు విలసిల్లున్. |
116 |
| గీ. |
నెఱయ నవ్యయపదములన్నియు సమాస రూపమున నాంధ్రకవితకు రుచి యొనర్చు స్వర్వధూమణి యన వృథాశంక యనఁ బు నః ప్రణత నాఁగ నుచ్చైర్నినాద మనఁగ. |
117 |
| క. |
వృథ యను నవ్యయ మొక్కఁడు ప్రథితంబై చెల్లుఁ గృతులఁ బ్రత్యేకము తా వృథసేయక యెపుడు మనో రథములు మాకిచ్చు నీ మురద్విషుఁ డనఁగన్. |
118 |
| క. |
కారకజనితక్రియయును నారఁగ ల్యప్ప్రత్యయాది కావ్యయము దెనుం గైరంజిలుఁ బూజించి వి చారించి యుదాహరించి సంధించి యనన్. |
119 |
| విశేష్య విశేషణంబులు | ||
| క. |
హరి కరుణాకరుఁ డనఁగా హరి యనుశబ్దము విశేష్య మగు మఱి కరుణా కరుఁ డనుట విశేషణ మి ట్లురుతరగతిఁ గారకప్రయోగము లమరున్. |
120 |
| క్రియావిశేషణంబులు | ||
| క. |
పగతునితమ్ముని శాశ్వత ముగ నిల్పెను దశరథేంద్రపుత్త్రుండనుచో జగమునఁ గ్రియావిశేషణ మగు నీయెడ శాశ్వతముగ నని పల్కుట దాన్. |
121 |
| ఆ. |
శబ్దసిద్ధికొఱకు సంధిసమాసరూ పంబు లిట్లు కొంతపలుకఁబడియె మఱియు నుచితరీతి నెఱుఁగంగవలయు ర హస్యలక్షణంబు లాంధ్రకవులు. |
122 |
| పంచాశద్వర్ణంబులు | ||
| క. |
భూమిఁ బదాఱచ్చులు వాఁ గా మెఱసి అకారమాదిగా స్వరము లగు\న్ కా మొదలు క్షకారముతుద యై ముప్పదినాల్గుహల్లు లగు వ్యంజనముల్. |
123 |
| క. |
తగు హ్రస్వంబులు దీర్ఘము లగు అఇఉఋఌలును వెండి హ్రస్వాభావం బగు ఏఐఓఔలు నె సఁగు అం అః అనఁగ షోడశస్వరము లగున్. |
124 |
| క. |
కచటతప వర్గవర్ణము లెచట\న్ స్పర్శ లగు నిరువదే నై మఱి యం దుచితగతి\న్ ఙఞణనమ ప్రచయం బను నాసికాఖ్యఁ బ్రస్తుతినొందున్. |
125 |
| క. |
యరలవ లంతస్థలు నాఁ బరఁగును శషసహలు తేటపడు నూష్మలన\న్ సొరిది క్షకారముఁ గూడఁగ సరి నేఁబది యయ్యె వర్ణసంఖ్య ధరిత్రిన్. |
126 |
| క. |
ళలలకు భేదము లే దను పలుకుఁన ళాఁ దొలఁగి యైదుపదులగు వర్ణం బులు సంస్కృతభాషకు మఱి తెలుఁగున ఱళ లనఁగ రెం డధిక మండ్రు హరీ! |
127 |
| గీ. |
రాఁదొలంగి సమస్తాక్షరముల మీఁదఁ గార మగుఁ గకారంబు క్షకార మనఁగ నట రవర్ణంబుపై నిఫ యనఁగఁ బరఁగుఁ గాన నిది రేఫ యని పలుకంగవలయు. |
128 |
| క. |
వర్ణం బన నక్షర మన నర్ణం బన మాతృక యన నక్కర మనఁగా నిర్ణీత సమాహ్వయములు వర్ణితములు కృతులయందు వ్రాలకునెల్లన్. |
129 |
| క. |
ఆదులు వర్గత్రయమును భూదేవతలు తపవర్గములు రవలును ధా త్రీదయితులు యలశషసహ లాదటనూరుజులు ళక్షరాఖ్యలు శూద్రుల్. |
130 |
| షడ్వర్గంబులు | ||
| క. |
ఏకాదిషడంతముగ\న్ బ్రాకటపాదములు గలుగు మంజరి మొదలా లోకితషడ్వర్గంబులు శ్రీకలితచ్ఛంద మవధరింపుము కృష్ణా! |
131 |
| ఉ. |
శ్రీనిధి చక్రవర్తిగురు శేఖర పుణ్యకటాక్ష లబ్ధ సు జ్ఞానుఁ డనంతధీమణిలసన్మణి భోజచరిత్ర చెప్పి ల క్ష్మీనరసింహుఁ గూర్చి నప్రసిద్ధుఁడు వేడుకతో నొనర్చె ఛం దోనుతి యోగిహృద్విమలతోయజవర్తి కనంతమూర్తికిన్. |
132 |
| ఉ. |
రాజులు పాడిఁ దప్పక ధరావలయం బఖిలంబు నేలెడి\న్ భూజనరాజి సంపదలఁ బొంపిరివోని సుఖానుభూతిచే నోజఁ జరింపుచుండెడిఁ బయోజసముద్భవకల్పశాశ్వతం బై జలజోదరాంకితమహాకృతి సన్నుతినొందుచుండెడున్. |
133 |
| గద్యము. |
ఇది శ్రీవాణీవరప్రసాదలబ్ధవాగ్విభవతిక్కనామాత్య తనూభవ సుకవిజనవిధేయ యనంతయనామధేయ ప్రణీతం బైన ఛందోదర్పణమునందు వర్జనీయంబు లగు దశదోషంబుల నేర్పఱుచుటయు, నందుదోషరహితంబులై యాదరణీయంబు లగుపట్లు దేర్చుటయు సంధి సమాసంబులు పంచాశద్వర్ణంబు లేర్పఱుచుటయు నన్నది చతుర్థాశ్వాసము. |
|